: దినకరన్ కేసులో మంత్రుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. వారిచ్చిన డబ్బులతోనే ఈసీకి ఎర!
దినకరన్ కేసులో కొందరు మంత్రుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అన్నాడీఎంకే వైరి వర్గాలుగా చీలిపోయిన తర్వాత పార్టీ రెండాకుల గుర్తును నిలుపుకునేందుకు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఏకంగా ఎన్నికల సంఘం అధికారులకే లంచం ఇవ్వజూపారు. ఈ కేసులో అడ్డంగా బుక్కయిన ఆయన ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. దినకరన్ ఈసీకి ఇవ్వజూపిన సొమ్మును కొందరు మంత్రులే సర్దినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు.
దినకరన్ ఆ సొమ్మును తన అనుచరుడు మల్లికార్జున్ ద్వారా ఏజెంట్లకు పంపిణీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో దినకరన్‌కు డబ్బులు ఇచ్చిన మంత్రుల సంగతిని కూడా చూడాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ పోలీసులు దినకరన్‌ను చెన్నై తీసుకొచ్చి అక్కడా విచారించారు. అలాగే మాజీ ఐఏఎస్ మోహన్ రంగం ఇంటికి వెళ్లి గంటకు పైగా విచారణ జరిపారు.
నగరంలో ఉండే మరో సీనియర్ ఐఏఎస్‌ను కూడా రహస్యంగా విచారించారు. కాగా, శుక్రవారం ఢిల్లీ పోలీసులు నరేశ్ అనే హవాలా ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ద్వారానే దినకరన్ బ్రోకర్ సుఖేశ్ చంద్రకు రూ.10 కోట్లు పంపి ఎన్నికల అధికారులతో బేరసారాలు సాగించినట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.