: మే 15 లోపు తమిళనాడుకు కొత్త గవర్నర్.. మేఘాలయ గవర్నర్‌గా మోత్కుపల్లి!


వచ్చేనెల 15వ తేదీలోపు తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మేలో ఆయన శ్రీలంక పర్యటనకు వెళ్లనుండడంతో ఆలోపే గవర్నర్ల నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం కూడా కసరత్తు చేస్తోంది. కసరత్తు పూర్తయ్యాక మే 12న తమిళనాడుకు కొత్త గవర్నర్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

తమిళనాడుతోపాటు మధ్యప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లను నియమించాల్సి ఉంది. ఆయా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతో పాటు తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రస్తుతం తమిళనాడుకు ఇన్‌చార్జి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులను మేఘాలయ గవర్నర్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ సేవలను మరికొంత కాలంపాటు ఉపయోగించుకోవాలని భావిస్తున్న ప్రధాని ఆయనను మరో రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News