: 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ఖాతాలో అరుదైన రికార్డు
'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. భారతీయ సినీ పరిశ్రమలో ఇంతవరకు ఏ సినిమాకు అందని ద్రాక్షగా ఉన్న రికార్డును 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సాధించినట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 6,500 ధియేటర్లలో విడుదలైన బాహుబలి భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా విడుదలైన తొలిరోజే 100 కోట్ల మార్కును దాటేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో భారతీయ సినీ పరిశ్రమ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా తొలి రోజు వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' రికార్డు నెలకొల్పిందని వారు చెబుతున్నారు. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని నిర్మాతలు ప్రకటించడం లేదని చెబుతున్నారు.
తొలి రోజు తెలుగులో 40 కోట్ల రూపాయలు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రపరిశ్రమల్లో 60 కోట్ల రూపాయలు, హిందీలో 40 కోట్ల రూపాయలకు తోడు ఓవర్సీస్ రికార్డులు సాధించడంతో 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా తొలి రోజే సుమారు 120 కోట్ల రూపాయలు వసూలు చేసిందని పలువురు పేర్కొంటున్నారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సొంతం చేసుకుంటుందని, శని, ఆది వారాలతో పాటు, మే డే కూడా కలిసి రావడంతో వరుస మూడు సెలవులను సినీ అభిమానులు ఈ సినిమాను వీక్షించడం ద్వారా పండగ చేసుకుంటారని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.