: ‘హలో, నేను ఐఎస్ఐ ఏజెంట్ ని.. ’అంటూ బెంబేలెత్తించిన ప్రయాణికుడు!
ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఓ ప్రయాణికుడు తన మాటలతో బెంబేలెత్తించాడు. పాకిస్థానీ పాస్ పోర్టు కలిగి ఉన్న ముఫ్పై ఎనిమిది సంవత్సరాల మహ్మద్ అహ్మద్ షేక్ మహమ్మద్ రఫీక్ ఈ రోజు దుబాయ్ నుంచి ఢిల్లీ లోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దిగాడు. అనంతరం, ఎయిర్ పోర్టులోని ‘హెల్ప్ డెస్క్’ వద్దకు వెళ్లి అక్కడి అధికారితో..‘హలో, నేను ఐఎస్ఐ ఏజెంట్ ను. కానీ, ఇంతకుమించి మాట్లాడాలని నేను కోరుకోవడం లేదు. నేను భారత్ లోనే ఉండాలని అనుకుంటున్నాను. నేను పాకిస్థాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ..ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని మీతో పంచుకోవాలను కుంటున్నాను’ అని అనడంతో ఆశ్చర్యానికి గురైన ఆ అధికారికి అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థంకాలేదు.
వెంటనే, ఎయిర్ పోర్టులోని భద్రతాధికారులకు ఈ సమాచారం అందజేయడంతో, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా, దుబాయ్ నుంచి వచ్చిన మహ్మద్ అహ్మద్ షేక్ మహమ్మద్ రఫీక్, ఢిల్లీ నుంచి ఖాట్మండ్ వెళ్లేందుకు టికెట్టు బుక్ చేసుకున్నాడు. అయితే, ఢిల్లీలో దిగిన వెంటనే ఖాట్మండ్ వెళ్లాల్సిన విమానం ఎక్కకుండా.. ‘బ్రేక్ జర్నీ’ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు లోని ‘హెల్ప్ డెస్క్’ వద్దకు వెళ్లాడు. ఐఎస్ఐ తో తనకు సంబంధాలు ఉన్నాయని, భారత్ లో ఉండాలని నిర్ణయించుకున్నానని మహ్మద్ అహ్మద్ షేక్ మహమ్మద్ రఫీక్ బిగ్గరగా చెప్పినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థల అధికారులు ఆయనను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి విచారణ చేస్తున్నారు.