: ఇక ఎక్కువకాలం యవ్వనంతో ఉండచ్చు...!?
యవ్వనం అనేది అందరికీ ఇష్టమైన దశ. ఇది ఎంత త్వరగా వస్తుందో అంతే వేగంగా కరిగిపోతుంది. అయితే ఇకనుండి ఎక్కువ కాలం యవ్వన దశలో ఉండవచ్చట. అంటే వయసు మీదపడటాన్ని నియంత్రించవచ్చని ఎషీవా విశ్వవిద్యాలయానికి చెందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు త్వరగా పెరగడానికైనా, ఆలస్యంగా వృద్ధాప్యం రావడానికైనా హైపోథలామస్ ద్వారా వెలువడే నియంత్రణే కారణమని, దీంతో ఈ సంకేతాలను మార్చడం ద్వారా అంత త్వరగా వృద్ధాప్యాన్ని దగ్గరకు రాకుండా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హైపోథలామస్ శరీర ఎదుగుదల, పునరుత్పత్తి, జీవనక్రియ వంటి వాటిల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే వయసు మీదపడడం వంటి అంశాలను కూడా ఇది ప్రేరేపిస్తుందనే అనుమానాన్ని డాంగ్‌షెంగ్ కెయి వ్యక్తం చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో ఎన్‌ఎఫ్`కేబీ అనే ప్రోటీన్ సముదాయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి హైపోథలామస్‌లోని వాపులను పరిశీలించారు. హైపోథలామస్‌లో ఎన్‌ఎఫ్`కెబీ మార్గాన్ని ప్రేరేపించినపుడు వయసు పెరగడం అనే ప్రక్రియ వేగంగా జరిగినట్టు గుర్తించారు. ఫలితంగా ఎలుకల్లో చర్మం మందగించడం, విషయ గ్రహణ సామర్ధ్యం తగ్గడం వంటి అంశాలను గమనించారు. దీంతో ఎన్‌ఎఫ్`కేబీ మార్గాన్ని గనుక అడ్డుకుంటే వయసు పెరుగుదలకు అడ్డుకట్ట వేయవచ్చని ఫలితంగా ఆయుర్ధాయం కూడా పెంచవచ్చని ఆయన అంటున్నారు. ఆయుర్ధాయం మాట పక్కనపెడితే ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కాబట్టి ఈ పరిశోధనలు త్వరగా ఫలితాలనివ్వాలని కోరుకుందామా...!