: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ లో కోదండరామ్ కు చేదు అనుభవం!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ లో రైతు సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన తెలంగాణ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరామ్ కు చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. మోత్కూరులో ధాన్యం నిల్వలు పేరుకుపోవడం, అమ్మకాలకు సంబంధించిన సమస్యలపై స్థానిక రైతులను అడిగి తెలుసుకునేందుకు ఈ రోజు ఆయన అక్కడికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని కోదండరామ్ ను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం, కోదండరామ్ మాట్లాడుతూ, మార్కెటు యార్డుకు ఆదాయం వస్తున్నప్పటికీ రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా, పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా రైతులందరినీ సమానంగా చూడాలని, రైతుల పరపతి మేరకు వారి పంటను ముందుగా కొనుగోలు చేయడం, పరపతి లేని రైతుల పంటను కొనకుండా వాయిదా వేయడం సబబు కాదని అన్నారు.