: జగన్ బెయిల్ రద్దు కోసం బాబు ప్రయత్నించారు.. జగన్ చిన్న తప్పు కూడా చేయలేదు: భూమన
జగన్ బెయిలును రద్దు చేయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు తీవ్రంగా ప్రయత్నించారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు సరిగా పట్టించుకోవడం లేదంటూ లేనిపోని అపోహలను కల్పించారని అన్నారు. ప్రజాక్షేత్రంలో జగన్ ను ఎదుర్కోలేక, సరైన పాలన అందించలేక చంద్రబాబు సతమతమవుతున్నారని... అందుకే కేసులతో జగన్ ను దోషిగా నిలబెట్టాలని యత్నించారని ఆరోపించారు.
ప్రజల్లో జగన్ ను చులకన చేసేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. జగన్ ఏ చిన్న తప్పు కూడా చేయలేదని... సోనియా, చంద్రబాబులు కుట్ర పన్ని జగన్ ను జైలుకు పంపారని ఆరోపించారు. భవిష్యత్తులో కూడా తీర్పు జగన్ కే అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేసుల నుంచి జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. సీఎంఎస్ సంస్థ సర్వే ప్రకారం అవినీతిలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందని విమర్శించారు.