: జగన్ నివాసంలో కుటుంబ సభ్యుల ప్రార్థనలు
అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. బెయిల్ పై బయట ఉన్న జగన్... ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ... సీబీఐ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి నేడు సీబీఐ కోర్టు తీర్పును వెలువరించనుంది. ఒకవేళ సీబీఐ అభియోగాలను కోర్టు నమ్మితే జగన్ బెయిలు రద్దవుతుంది. ఆయన మరోసారి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇటు జగన్ కుటుంబసభ్యులు, అటు వైసీపీ శ్రేణులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో ఉన్న చర్చిలో బ్రదర్ అనిల్ కుమార్ (షర్మిల భర్త) ఆధ్వర్యంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. కోర్టు తీర్పు జగన్ కు అనుకూలంగా ఉండాలని కుటుంబసభ్యులు జీసస్ ను ప్రార్థిస్తున్నారు. ఈ ప్రార్థనల్లో జగన్ తల్లి విజయలక్ష్మి, భార్య భారతి తదితరులు పాల్గొన్నారు.