: ప్రియాంక చోప్రా పార్టీ ఇస్తే వెళ్లిన మీకు... వినోద్ ఖన్నా అంత్యక్రియలకు రావడానికి తీరిక లేదా?: రిషికపూర్ ఫైర్
ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నిన్న ముంబైలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రణదీర్ కపూర్, జాకీష్రాఫ్, అర్జున్ రాంపాల్, కబీర్ బేడి తదితరులు హాజరు కాగా, ప్రస్తుత స్టార్ లు, వర్థమాన నటులు హాజరుకాలేదు. దీనిపై సీనియర్ నటుడు రిషి కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, రిషికపూర్ కూడా హాజరు కాలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ, కుటుంబ సభ్యులతో కలసి తాను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయానని చెప్పారు.
అయితే ‘ఈ తరానికి చెందిన ఒక్క నటుడు కూడా వినోద్ ఖన్నా అంత్యక్రియలకు హాజరుకాకపోవడం అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఆయనతో కలిసి నటించినవారు కూడా ఆయన అంత్యక్రియలకు రాకపోవడం దారుణమని ఆయన తెలిపారు. ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన సినీ నటులకు హితవు పలికారు. భవిష్యత్ లో తాను మరణించినా, తన శవాన్ని మోస్తారన్న గ్యారెంటీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ తరం సోకాల్డ్ స్టార్స్ పై తనకు చాలా కోపం వస్తోందని ఆయన తెలిపారు. ఈ మధ్య తాజాగా హాలీవుడ్ కి వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీకి ఈ తరం చెమ్చా గ్యాంగ్ మొత్తం వెళ్లారని ఆయన ఎద్దేవా చేశారు. వినోద్ ఖన్నా అంత్యక్రియలకు మాత్రం హాజరయ్యేందుకు వారికి తీరిక లేకుండా పోయిందని ఆయన ధ్వజమెత్తారు.