: విమానం హైజాక్ అయిందంటూ మోదీకి ట్వీట్.. వెంటనే స్పందించిన పీఎంవో!
'తాము ప్రయాణిస్తున్న విమానం హైజాక్ అయినట్టుంది... కాపాడండి ప్లీజ్' అంటూ ఓ ప్రయాణికుడు ఏకంగా ప్రధాని మోదీకి ట్వీట్ చేశాడు. అంతే... ఈ ట్వీట్ ప్రకంపనలు సృష్టించింది. ఈ ట్వీట్ పై పీఎంవో క్షణాల్లో స్పందించింది. సీఐఎస్ఎఫ్, పౌర విమానయాన భద్రతా సంస్థ, స్థానిక పోలీసులు, అధికారులను ఉరకులు పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే, 176 మంది ప్రయాణికులతో నిన్న ముంబై నుంచి ఢిల్లీకి 9డబ్ల్యూ355 విమానం (జెట్ ఎయిర్ వేస్) బయల్దేరింది. అయితే, ఢిల్లీలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో... విమానాన్ని జైపూర్ కు మళ్లించారు. దీంతో, విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు భయాందోళనకు గురయ్యాడు. విమానాన్ని హైజాక్ చేశారని భయపడ్డ అతను... వెంటనే తన భయాన్ని ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
విమానం జైపూర్ లో దిగగానే అధికారులంతా సెక్యూరిటీ ప్రొటోకాల్ ప్రకారం తనిఖీలు నిర్వహించారు. ట్వీట్ చేసిన వ్యక్తిని విచారణ నిమిత్తం కిందకు దించేశారు. తనిఖీలు పూర్తయిన తర్వాత, ఎలాంటి సమస్య లేదని తేల్చుకున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విమానాన్ని ఢిల్లీకి పంపించేశారు. అయితే ప్రధానికి ట్వీట్ చేసిన ప్రయాణికుడిని మాత్రం తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తమకు తెలియదని జెట్ ఎయిర్ వేస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.