: సేమ్ సీన్ రిపీట్.. ఓడిన బెంగళూరు.. ప్లే ఆఫ్ అవకాశాలు ఆవిరి!


ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఏమాత్రం పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. గురువారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలై ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అతిరథ మహారథులున్న జట్టు చేతులెత్తేయడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న గుజరాత్ లయన్స్ బెంగళూరుపై గెలుపుతో నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.  

గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. ఒకానొక దశలో మరో చెత్త రికార్డును లిఖిస్తుందని భావించినా పవన్ నేగి 32 (19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేదార్ జాదవ్ 31 (18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ అరోన్ ఫించ్ దెబ్బకు 13.5 ఓవర్లలోనే విజయం సాధించింది. 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేసిన ఫించ్ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆడిన 9 మ్యాచుల్లో ఆరింటిలో ఓడిన బెంగళూరు ఐదో స్థానానికి పడిపోగా, ఆడిన 8 మ్యాచుల్లో మూడింటిలో గెలిచిన లయన్స్ ఆరోస్థానంలో నిలిచింది.
 

  • Loading...

More Telugu News