: షరపోవాపై సంచలన వ్యాఖ్యలు చేసిన టెన్నిస్ క్రీడాకారిణి బౌచర్డ్
15 నెలల నిషేధం అనంతరం స్టుగార్ట్ ఓపెన్ లో పునఃప్రవేశం చేసిన రష్యా టెన్నిస్ అందం మారియా షరపోవా తొలి రౌండ్ లో 7-5, 6-3 తేడాతో రాబర్ట్ విన్సిని ఓడించింది. ఈ నేపథ్యంలో షరపోవాపై కెనడా టెన్నిస్ క్రీడాకారిణి యూజిని బౌచర్డ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. షరపోవా మోసగత్తె అని ఆరోపించింది. డోపింగ్ కు పాల్పడిన షరపోవాకు జీవితకాల నిషేధమే సరైన నిర్ణయమని స్పష్టం చేసింది. ఆమె లాంటి వారిని టెన్నిస్ లోకి మళ్లీ ఆహ్వానించకూడదని సూచించింది.
ఆమెను మళ్లీ ఆడనివ్వడమంటే ఇతర క్రీడాకారిణులకు అన్యాయం చేయడమేనని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆమెను మళ్లీ ఆడనివ్వడం ద్వారా మహిళల టెన్నిస్ సంఘం భవిష్యత్ తరాల పిల్లలకు తప్పుడు సందేశం ఇవ్వడమేనని ఆమె స్పష్టం చేసింది. కాగా, ఐదు గ్రాండ్ స్లాంల విజేత అయిన షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం తీసుకుని 15 నెలల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.