: దినకరన్‌ను ఇలా తప్పించవచ్చు... సలహా ఇచ్చిన తమిళ ఐపీఎస్‌లు!
ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టై ప్రస్తుతం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల కస్టడీలో ఉన్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ను తప్పించేందుకు తమిళనాట ముమ్మర ప్రయత్నాలు జరిగినట్టు తెలిసింది. దినకరన్‌ను రక్షించేందుకు తమిళనాడుకు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్టు బయటపడింది. దినకరన్ సెల్‌ఫోన్‌ను పరిశీలించిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. కోటి రూపాయలకు పైగా డబ్బుతో ఢిల్లీలో బ్రోకర్ సుఖేశ్ చంద్ర అరెస్టయిన తర్వాత దినకరన్ ముగ్గురు ఐపీఎస్ అధికారులతో మంతనాలు సాగించినట్టు గుర్తించారు.
దినకరన్‌పై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతూ దినకరన్‌కు వారు సలహా ఇచ్చినట్టు చెబుతున్నారు. అంతేకాదు, ఢిల్లీలో తమ పలుకుబడితో దినకరన్‌ను బయటపడేస్తామని హామీ కూడా ఇచ్చినట్టు సమాచారం. కేసు నుంచి బయటపడిన తర్వాత చేసిన సాయానికి ప్రతిఫలంగా తాము కోరుకున్న ప్రమోషన్లు ఇవ్వాలని లంకె పెట్టినట్టు తెలుస్తోంది. దినకరన్ కేసులో తాజాగా ఐపీఎస్ అధికారుల బాగోతం బయటపడడంతో వారిని కూడా విచారించాలని భావిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.