: పేటీఎం బంగారం లాంటి ఆఫర్... ఇక రూపాయికి కూడా పసిడి కొనేయొచ్చు!
ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ పేటీఎం బంగారం లాంటి పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని ‘డిజిటల్ గోల్డ్’ వ్యాలెట్‌ను ప్రారంభించింది. దీనిద్వారా 999.9 స్వచ్ఛత గల 24 క్యారెట్ల బంగారాన్ని రూపాయి అంతకంటే తక్కువ మొత్తంలో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన పసిడిని ‘డిజిటల్ గోల్డ్’ వ్యాలెట్‌లో దాచుకోవచ్చు.
కావాలనుకున్నప్పుడు దానిని ఇంటికి డెలివరీ చేయమని అడగవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో విక్రయించుకోవచ్చు. ఎంఎంటీసీ-పీఏఎంపీ సంయుక్తంగా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఎవరికి తగ్గ స్థాయిలో వారు బంగారం కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఎంటీసీ-పీఏఎంపీ చైర్మన్ మెహద్ భరోద్కర్ అన్నారు. పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ మాట్లాడుతూ డిజిటల్ గోల్డ్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఇదో సులభమైన మార్గమని అన్నారు. తమ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చన్నారు. వినియోగదారులు కావాలనుకున్నట్టు నాణేల రూపంలో వారి ఇంటికి బంగారాన్ని డెలివరీ చేస్తామని వివరించారు.