: బాబోయ్ దెయ్యం... ఇల్లు ఖాళీ చేసిన సినీ నటి అంజలి!
దెయ్యం ప్రధాన పాత్రలో సాగే సినిమాలో నటించి ఆకట్టుకున్న సినీ నటి అంజలి దెయ్యం భయంతో ఇల్లు ఖాళీ చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలోని నాగచైతన్య ఇంటికి సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఆమె ఉంటోంది. అయితే ఈ మధ్య కాలంలో ఆ ఇంటికి సమీపంలో ఎక్కువగా పిల్లులు తిరుగుతుండడాన్ని అంజలి గుర్తించింది. దీంతో ఆ ఇంట్లో దెయ్యాలేమైనా ఉన్నాయా? అన్న భయం ఆమెలో పెరిగింది.
దీనికి తోడు ఆ ఇంట్లో నుంచి అర్ధరాత్రి సమయంలో ఏవేవో వింత శబ్దాలు రావడం కూడా గుర్తించిందట. దీంతో ఆ ఇంట్లో దెయ్యం ఉందని నిర్ధారణకు వచ్చిన అంజలి... ఆ ఇంటిని ఖాళీ చేసేసిందని సమాచారం. హైదరాబాదులో సొంత ఇల్లు కొనుక్కోవాలని కూడా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కాగా, అంజలి ఆమధ్య 'గీతాంజలి' అనే దెయ్యం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.