: ఆ ఆకాశాన్ని పగలగొట్టయినా సాధిస్తామని కేసీఆర్ ఆనాడే అన్నారు: ఎంపీ కేశవరావు
వరంగల్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు తొలిపలుకులు పలికారు. ఈ ఆకాశాన్ని పగలగొట్టయినా తెలంగాణ తెస్తానని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆనాడే చెప్పారని, చివరకు తెలంగాణ వచ్చిందని కేశవరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని తెలియజెప్పేందుకే బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
ఈ మూడేళ్లలో ఎవ్వరూ ఊహించనంత అభివృద్ధిని సాధించామని చెప్పారు. రైతుకు ఆర్థిక సాయం కోసం కేసీఆర్ ఎకరానికి ఒక్కో పంటకు రూ.4 వేలు ప్రకటించారని, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ సీఎం ముందుకు వెళుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతంగా ముందుకు వెళుతున్నాయని ఆయన అన్నారు.