: కాసేపట్లో వరంగల్ లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ప్రారంభం.. వరంగల్ బయలుదేరిన కేసీఆర్
వరంగల్‌లోని హన్మకొండ ప్రకాశ్‌రెడ్డి పేటలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలివస్తున్నారు. ఈ సభావేదికకు 'ప్రగతి నివేదన సభ' అని పేరుపెట్టారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సభా ప్రాంగణానికి ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ వరంగల్ బయలుదేరారు. వేదికపై ఈ రోజు ఆయన గంట సేపు ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఈ సభలో సుమారు మూడు వేల మంది వాలంటీర్లు సేవలందిస్తున్నారు.