: మహిళా నక్సలైట్లను అసభ్యంగా వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెడుతున్నారు: మావోయిస్టు నేత వికల్ప్
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో 26 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన ఘటన ముమ్మాటికీ ప్రతీకార చర్యే అని మావోయిస్టు దండకారణ్యం అధికార ప్రతినిధి వికల్ప్ తెలిపారు. ఈ మేరకు ఆయన పేరుతో ఓ ఆడియో విడుదలైంది. భద్రతా బలగాలు తమపై దాడులు చేస్తూ, తమను మట్టుబెడుతున్నాయని ఆడియో ద్వారా ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్ర బలగాల అరాచకత్వం కొనసాగుతోందని... ఆదివాసీలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
సజీవంగా పట్టుబడ్డ మహిళా మావోయిస్టులను అసభ్యంగా వీడియోలు తీసి... సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ వికల్ప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచకాలకు వ్యతిరేకంగానే తాము దాడులకు పాల్పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా అరాచకాలు ఆపకపోతే... మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించారు.