: రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరై నేతలతో కేజ్రీవాల్ అత్యవసర సమావేశం!
ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఒక్కొక్కరుగా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామాలు చేస్తున్న వేళ, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరవుతున్న సీఎం కేజ్రీవాల్, పార్టీ నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల్లో పార్టీ పాప్యులారిటీ కనిష్ఠస్థాయికి దిగజారిందని ఫలితాలు వెల్లడించిన వేళ, పరిస్థితిని సమీక్షించారు. నిన్న ఢిల్లీ ఇన్ చార్జ్ దిలీప్ పాండే, కన్వీనర్ సంజయ్ సింగ్, ఎమ్మెల్యే అల్కా లాంబా, నేడు పంజాబ్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ సింగ్ రాజీనామాలు చేశారు.
270 మునిసిపల్ వార్డులకు ఎన్నికలు జరుగగా, ప్రభుత్వం నడుపుతూ కూడా కేవలం 48 చోట్ల మాత్రమే ఆప్ విజయం సాధించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 54 శాతంగా ఉన్న ఓట్ షేర్, 26 శాతానికి పడిపోయిన నేపథ్యంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలను కేజ్రీవాల్ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఓటమి నెపాన్ని ఈవీఎంలపై నెట్టిన ఆప్ ను ఆ పార్టీ నేతలే వ్యతిరేకిస్తుండటంతో, వైఖరిని మార్చుకోవాలని కేజ్రీవాల్ కు కొందరు సీనియర్ నేతలు సూచించినట్టు తెలుస్తోంది.