: మూర్ఛను ముందే పసిగట్టవచ్చు
సాధారణంగా మూర్ఛరోగులకు ఎప్పుడు మూర్ఛ వస్తుందో తెలియదు. దీంతో వారు ఒంటరిగా ఎక్కడికి వెళ్లాలన్నా వెనుకంజ వేస్తుంటారు. అయితే ఇకనుండి అలాంటి అవసరం లేకుండా మూర్ఛవ్యాధి రాకను ముందే పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నిజంగా ఇలాంటి రోగులకు ఆనందకరమైన కబురుగా చెప్పవచ్చు. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన శాస్త్రపరిజ్ఞానాన్ని ఆష్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోగి తలలోకి ప్రత్యేక సర్జరీ ద్వారా అమర్చే ఎలక్ట్రోడులు, రోగి చేతికి ఉండే పరికరానికి మూర్ఛకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేస్తాయి. దీంతో రోగులు జాగ్రత్తపడేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మూర్ఛ రావడాన్ని ముందే ఊహించగలిగే ఈ పరిజ్ఞానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా మూర్ఛ వ్యాధితో బాధపడే ఎందరో రోగులకు ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాదు ఈ శస్త్ర చికిత్స వల్ల వారి డ్రైవింగ్‌లోగానీ, పని సామర్ధ్యంలో కూడా అభివృద్ధి కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోగి మెదడు, పుర్రె మధ్యభాగంలో అమర్చే ఎలక్ట్రోడులు మెదడులోని విద్యుత్తు క్రియాశీలతను నమోదు చేస్తాయని, ఫలితంగా రోగి మెదడులో జరిగే మార్పులను పసిగట్టవచ్చని సెయింట్ విన్సెంట్ ఆసుపత్రి న్యూరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ మార్క్ కుక్ చెబుతున్నారు. ఇది నిజంగా మూర్ఛ రోగుల పాలిటి తీపి కబురే. అయితే ఈ శస్త్రచికిత్స అందరికీ అందుబాటులోకి వస్తే మరింత ఆనందదాయకం కదా...!