: దినకరన్ అరెస్టుపై ఆయన మద్దతుదారుల నిరసన .. ఆగ్రహం!


టీటీవీ దినకరన్ ను అర్ధరాత్రి అరెస్టు చేయడం ద్వారా తమిళనాడులో ఎలాంటి అలజడులు రేగకుండా ఢిల్లీ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. దినకరన్ కు పట్టున్న ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టారు. దీంతో ఆయన అరెస్టు సందర్భంగా ఎలాంటి నిరసనలు చోటుచేసుకోలేదు. కాగా, దినకరన్ అరెస్టుపై ఆయన మద్దతు వర్గం నేతలు ఆగర్హం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేకే (అమ్మ) కార్యదర్శి పుహళేంది మాట్లాడుతూ, టీటీవీ దినకరన్ ను రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారన్నారు. ఈసీకి లంచం ఇచ్చినట్లు తగిన ఆధారాలు లేకపోయినప్పటికీ, బ్రోకర్‌ సుఖేష్‌ అందించిన సమాచారంతో దినకరన్ ను అరెస్ట్‌ చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

దినకరన్ అరెస్టుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ మాట్లాడుతూ, దినకరన్ అరెస్టు తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీని చీల్చేందుకు బీజేపీ చేసిన కుట్ర అన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిననాటి నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ చర్యలు పలు సందేహాలను లేవనెత్తాయని ఆయన తెలిపారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు, అన్నాడీఎంకే పార్టీని ఛిన్నాభిన్నం చేసి, బీజేపీని బలపరుచుకునేందుకు, అంతవరకు ఆ పార్టీ నేతలు తమ కనుసన్నల్లో ఉంచుకొనేందుకు బీజేపీ చేసిన కుట్రలో భాగంగా దినకరన్ ను అరెస్టు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాకాకుంటే ఈసీకి లంచం ఎరచూపారని బ్రోకర్‌ సుఖేష్‌ వాంగ్మూలంలో తెలిపాడని చెబుతున్న ఢిల్లీ పోలీసులు...సుఖేష్ ఏం చెప్పాడో ఆ వివరాలను పూర్తిగా స్పష్టంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

దీనిపై టీఎంసీ నేత జీకే.వాసన్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రజా మద్దతు చూసి ఓర్వలేకే టీటీవీ దినకరన్ అరెస్టు చేశారని ఆరోపించారు. ఢిల్లీలో నాలుగు రోజులుగా విచారణ జరిపిన క్రైం బ్రాంచ్ పోలీసులు అర్ధరాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయనను అరెస్టు చేసినట్టు ప్రకటించడం హైడ్రామా అని ఆయన అభిప్రాయపడ్డారు. దినకరన్ అరెస్టులో కొందరు ప్రముఖుల హస్తముందని ఆయన ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి చట్టం ముందు నిలపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

దినకరన్ అరెస్టుపై అన్నాడీఎంకేకే (అమ్మ) పార్టీ నేత నాంజిల్ సంపత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దమ్ముంటే అన్నాడీఎంకేను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాలు విసిరారు. అలాకాకుండా దొడ్డిదారిన పార్టీ నేతలపై వేటు వేయడం సరికాదని ఆయన హెచ్చరించారు. దినకరన్ అరెస్టు వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని ఆయన స్పష్టం చేశారు. కాషాయవాదుల కుట్రలను ఆయన ధైర్యంగా ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దినకరన్ ను అవమానించాలని కోరుకొనే వారు తప్పకుండా రాజకీయాల్లో చతికిలబడతారని ఆయన శాపనార్థాలు పెట్టారు. ఇలాంటి నీచ రాజకీయాలకు బీజేపీ స్వస్తి పలకాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News