: దినకరన్ అరెస్ట్‌తో ఖుషీ, ఖుషీ.. అర్ధరాత్రి ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల చర్చలు!
లంచం కేసులో అన్నాడీఎంకే (అమ్మ) నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ అరెస్ట్ కావడంతో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు విలీన చర్చల్లో మునిగి తేలినట్టు తెలుస్తోంది. దినకరన్ అరెస్ట్‌ను పోలీసులు ప్రకటించిన వెంటనే మంగళవారం రాత్రి రహస్య ప్రదేశంలో ఇరు వర్గాలు ముమ్మర చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ చర్చల్లో ఇద్దరు ముఖ్యనేతలు కూడా పాల్గొన్నట్టు చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్‌తోనే బుధవారం చెన్నయ్ లోని రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో చిన్నమ్మ శశికళ ఫొటోలను తొలగించినట్టు తెలుస్తోంది.
పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో, ఆమె మేనల్లుడు దినకరన్ ఢిల్లీలో పోలీసుల కస్టడీలో ఉండడంతో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు పట్టలేని సంతోషంలో ఉన్నాయి. ఇక వారి పని అయిపోయినట్టేనని భావిస్తున్నాయి. ఆ ఆనందంలోనే చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో స్వయంగా పన్నీర్ సెల్వమే అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి చర్చలు జరుపుతారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీ కార్యాలయంలో తన బ్యానర్లను తొలగించిన విషయం తెలిసిన శశికళ షాక్ తిన్నట్టు తెలిసింది.