: నేడు గాల్లోకి తొలి ఉడాన్... అరగంట హెలికాప్టర్, గంట విమాన ప్రయాణం కేవలం 2,500 రూపాయలకే!
హెలికాప్టర్, విమానాల్లో ప్రయాణం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో హెలికాప్టర్ లో అరగంట, విమానంలో గంట ప్రయాణానికి (సుమారు 500 కిలోమీటర్ల దూరానికి) 2,500 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు. గత ఏడాది ప్రధాని ఘనంగా ప్రకటించిన ఈ పథకం నేటి నుంచి పట్టాలు ఎక్కనుంది. ‘ఉడాన్’ పథకంలో భాగంగా తొలి ప్రాంతీయ విమానాన్ని సిమ్లా-ఢిల్లీ మధ్య నడపనుండగా, ఈ విమానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ మధ్య తిరిగే ‘ఉడాన్’ విమానాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు.