: ఫ్రాన్స్ అధ్యక్ష అభ్యర్థి కంటే ఆయన భార్య 25 ఏళ్లు పెద్ద!.... ఆసక్తి గొలిపే వారి ప్రేమ కథ ఇదిగో!
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో తొలిరౌండ్లో విజయం సాధించిన ఎమ్మాన్యుయల్ మాక్రన్ తదుపరి దేశాధ్యక్షుడు కావటం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మాక్రన్ గురించిన విశేషాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఆయన ప్రేమ కథ ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. దాని వివరాల్లోకి వెళ్తే... అమియెన్స్ లోని జీస్యూట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో మాక్రన్ ప్రేమలో పడ్డారు. అప్పుడాయన వయసు సరిగ్గా 15ఏళ్లు. ఇంతకీ ఆయన ప్రేమించిందెవరినంటే.. తనకు పాఠాలు బోధించే 40 ఏళ్ల లెక్చరర్ బ్రిగిట్టి ట్రాగ్ న్యూను! అప్పటికే ఆమెకు పెళ్లయి, ముగ్గురు పిల్లలున్నారు. అంతేకాకుండా, ఆమె కుమార్తెల్లో ఒకరు మాక్రన్ తో పాటు చదువుకునేది.
అతని ప్రేమను బ్రిగెట్టీ మొదట్లో ఆకర్షణగా భావించి, సరదాగా తీసుకునేది. అయితే ఒక రోజు కాలేజీలో నాటకం వేస్తుండగా ఆయన నేరుగా వెళ్లి ఆమెకు ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే అందరి తల్లిదండ్రుల్లాగే మాక్రన్ తల్లిదండ్రులు కూడా వీరి ప్రేమకు అభ్యంతరం తెలిపారు. అంతే కాకుండా తమ కొడుక్కి దూరంగా ఉండాలంటూ ఆమెను సీరియస్ గా హెచ్చరించారు. ఆమెకు దూరంగా ఉంచేందుకు మాక్రన్ ను పారిస్ కు ఉన్నత చదువుల కోసం పంపారు. అయితే ఈ దూరం వారిని మరింత దగ్గర చేసింది. వీరి మధ్య ప్రేమ పెరుగుతూ వచ్చింది.
ఇంతలో మాక్రన్ డిగ్రీ పూర్తి చేయగా, బ్రిగిట్టీ తన భర్తను వదిలేసి మాక్రన్ కోసం పారిస్ వచ్చేశారు. దీంతో 2007లో వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం వారి కుటుంబంలో ఆందోళన నింపినా...వారి కోరిక మేరకు తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు గౌరవించారు. దీంతో వారి వివాహం జరిగి పదేళ్లైంది. ప్రస్తుతం మాక్రన్ వయసు 39 ఏళ్లు కాగా, బ్రిగెట్టీ వయసు 64 ఏళ్లు. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నట్టు ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడైతే...చిన్నవయసులో ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తిగా నిలబడతారు.