: ఏ సినిమా చేయాలన్నది బూటాన్ వెళ్లొచ్చాక ఆలోచిస్తా: దర్శకుడు రాజమౌళి
‘బాహుబలి’ సినిమా కోసం ఐదేళ్ల పాటు శ్రమించిన దర్శకుడు రాజమౌళి కొన్ని రోజుల పాటు రిలాక్స్ కానున్నారు. ఈ నేపథ్యంలో హాలిడే టూర్ కు బూటాన్ వెళుతున్నట్టు రాజమౌళి పేర్కొన్నారు. ఈ నెల 28న ‘బాహుబలి-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తదుపరి సినిమా ఏం చేయాలన్నది ఇంకా నిర్ణయించు కోలేదని, హాలిడే టూర్ నుంచి వచ్చిన తర్వాత ఆలోచిస్తానని చెప్పారు.
తన తదుపరి సినిమాను గ్రాఫిక్స్ లేకుండా తీయాలనే ఆలోచన ఉందని, అయితే, అది ఎంత వరకు సాధ్యమౌతుందో తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన కుటుంబమే తనకు బలమని, వారి సహకారం వల్లే ‘బాహుబలి’ లాంటి సినిమాను నిర్మించగలిగానని రాజమౌళి చెప్పారు.