: సోషల్ మీడియాలో వదంతులు పోస్ట్ చేసేవారంతా ఒక్కసారి ఆలోచించుకోవాలి: జ్యోతిక
అట్లీ దర్శకత్వంలో విజయ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో మొదట జ్యోతికను తీసుకోవాలని అనుకున్నారు. అయితే, ఆ సినిమా నుంచి చివరి నిమిషంలో జ్యోతిక తప్పుకోవడంతో, ఈ అంశంపై పలు పుకార్లు వచ్చాయి. తన భర్త సూర్య కారణంగానే జ్యోతిక ఈ సినిమా నుంచి తప్పుకుందని, విజయ్‌తో తన భార్య జ్యోతిక నటించడం ఇష్టంలేకపోవడంతోనే సూర్య ఇందుకు నిరాకరించాడని అనుకున్నారు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన జ్యోతిక తాను ఆ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం తన భర్త సూర్య కాదని తెలిపింది. దర్శకుడు అట్లీతో ఓ అంశంపై చిన్న భేదాభిప్రాయం ఏర్పడిందని ఆమె చెప్పింది. అయినప్పటికీ దాన్ని తర్వాత తాము స్నేహపూర్వకంగా పరిష్కరించుకున్నట్లు వివరించింది. ఆధారాల్లేకుండా సామాజిక మాధ్యమాల్లో వదంతులు పోస్ట్ చేసేవారంతా ఒక్కసారి ఆలోచించుకోవాలని ఆమె సూచించింది.