: హిందూ యువకుడికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం సోదరులు!
మతసామరస్యాన్ని చాటుతూ పశ్చిమ బెంగాల్ మాల్డా జిల్లాలోని షేక్ పురా గ్రామంలో ముస్లిం సోదరులు ఓ హిందువుకి అంతిమ సంస్కారాలు చేశారు. ఆ ప్రాంతంలో అధికంగా ముస్లిం కుటుంబాలే నివసిస్తున్నాయి. వారి ప్రాంతంలో ఉండే రెండు మూడు హిందూ కుటుంబాలతో వారు ఎంతో సఖ్యతతో ఉంటారు. కాగా, నిన్న బిస్విజిత్ అనే హిందూ యువకుడు మృతి చెందాడు. ఆ యువకుడిది నిరుపేద కుటంబం కావడంతో అంత్యక్రియలకు డబ్బులు లేవు. దీంతో చేసేది ఏమీ లేక ఆ మృతదేహాన్ని ఎదురుగా పెట్టుకుని అతడి తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చున్నారు.
అయితే, అక్కడి ముస్లిం కుటుంబాల్లోని వ్యక్తులు మరుసటి రోజు ఉదయమే మృతుడి ఇంటికి వచ్చి సాయం చేస్తామని చెప్పారు. ఒక కట్టెల మంచంపై బిస్వజిత్ మృతదేహాన్ని ఉంచి ‘బోలో హరి, హరి బోలో’ అంటూ హిందూ సంప్రదాయం ప్రకారం శ్మశానానికి తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించారు. భారత భూమికి హిందూ, ముస్లింలు ఇద్దరూ కొడుకులేనని ముస్లిం సోదరులు అన్నారు.