: సమయానికి హాజరుకాని అధికారులపై మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం
సమీక్షా సమావేశానికి సమయానికి హాజరుకాని అధికారులపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు మిర్చియార్డులో సమస్యలపై మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, నక్కా ఆనందబాబు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. యార్డు నుంచి మిర్చి బస్తాల సత్వర తరలింపు, అగ్నిప్రమాదాల నివారణ వంటి విషయాలపై చర్చించారు.
ఈ సమావేశానికి అధికారులు సరైన సమయానికి రాకపోవడంతో సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. మూడు, నాలుగు రోజుల్లో యార్డులో పరిస్థితి సాధారణ స్థితికి రావాలని, మిర్చి కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామని ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.