: ఆ సీన్ చేసేటప్పుడు చాలా భయం వేసింది: రమ్యకృష్ణ
'బాహుబలి' సినిమాలో దర్శకుడు రాజమౌళి తనపై పెట్టుకున్న నమ్మకానికి పూర్తి న్యాయం చేశానని రమ్యకృష్ణ తెలిపింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఎవరైనా తనకు కథ చెబుతుంటే నిద్ర వస్తుంటుందని...కానీ రాజమౌళి కథ చెబుతుంటే తనకు ఒళ్లు గగుర్పొడిచిందని చెప్పింది. బహుశా నిద్రపోకుండా తాను విన్న కథ ఇదే అయి ఉంటుందని తెలిపింది. తాను పోషించిన శివగామి పాత్ర కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేయలేదని... రాజమౌళి చెప్పినట్టు చేశానని చెప్పింది.
ఈ సినిమాలో... నీటిలో మునిగి బిడ్డను పట్టుకున్న సీన్ చేసేటప్పుడు చాలా భయపడ్డానని రమ్యకృష్ణ తెలిపింది. కేరళలోని చల్లకుడి జలపాతం వద్ద ఈ సీన్ షూట్ చేశారని...నీటి వేగం ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో తాను మునిగిపోయి, చేతిని పైకి ఎత్తాలని... ఈ సమయంలో నీటి ప్రవాహానికి తాను అటూ, ఇటూ వెళ్లి పోయేదాన్నని చెప్పింది. దీంతో, తనకు ఎంతో భయం వేసేదని తెలిపింది. అయితే, శివగామి మొహంలో నేను భయం చూడకూడదంటూ రాజమౌళి తనలో ధైర్యం నింపేవారని చెప్పింది. మొత్తానికైతే భయపడుతూనే ఆ సీన్ ను ముగించేశానని రమ్య తన అనుభవాలను పంచుకుంది.