: జియో కస్టమర్లకు మరో సంవత్సరం పాటు పండగే!
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్. తన వ్యాపార ప్రత్యర్థులను కోలుకోని దెబ్బతీసే క్రమంలో రిలయన్స్ యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జియో అందిస్తున్న ఫ్రీ ఆఫర్లు, డిస్కౌంట్ ఆఫర్లు మరో ఏడాది నుంచి 18 నెలల వరకు కొనసాగిస్తూనే ఉంటారని సమాచారం. వాస్తవానికి జియో దెబ్బకు ఐడియా, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్, ఎయిర్ టెల్ లాంటి దిగ్గజాలు కూడా అన్ లిమిటెడ్ ఆఫర్ల బాట పట్టాయి.
ఇది ఎంతో ఆర్థిక భారంతో కూడుకున్న వ్యవహారమే అయినప్పటికీ... వేరే దారి లేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్లను ఎక్కువ కాలం కొనసాగించడం సాధ్యమయ్యే పని కాదు. ఇదే విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకునే పనిలో జియో ఉంది. మరో సంవత్సర కాలం పాటు ఈ ఆఫర్లను ఏ ఇతర కంపెనీ భరించలేదు కాబట్టి... ఆ పని తాను చేస్తే, ప్రత్యర్థి కంపెనీలన్నీ మటాష్ అయిపోతాయని జియో భావిస్తోంది. ఇదే నిజమైతే... జియో వినియోగదారులకు మరో ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు పండగే పండగ.