: 14 ఏళ్లలోపు పిల్లలు భద్రంగా రోడ్డు దాటలేరు: పరిశోధన


14 ఏళ్లలోపు పిల్లలకు భద్రంగా రోడ్డు దాటేంత పరిపక్వత ఉండదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ లోవా పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. కంప్యూటర్‌ సిమ్యులేషన్ (పరిశోధన కోసం రూపొందించిన కంప్యూటర్ ప్రొగ్రాం) ద్వారా రోడ్డుపై వర్చువల్‌ గా వాహనాలను సృష్టించి పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందులో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కార్ల మధ్య 6, 8, 10, 12, 14, ఆపై వయసున్న పిల్లలను రోడ్డు దాటాలని పరిశోధకులు సూచించారు. వారంతా పలు మార్లు రోడ్డు దాటుతుండగా ఫలితాలను నమోదు చేశారు.

ఆరేళ్ల పిల్లలు 8 సార్లు, ఎనిమిదేళ్ల పిల్లలు 6 సార్లు, పదేళ్ల పిల్లలు 5 సార్లు, 12 ఏళ్ల పిల్లలు 2 సార్లు రోడ్డు దాటుతున్న సమయాల్లో కార్ల మధ్య ఆగిపోయి ప్రమాదాల బారినపడ్డారు. వీరంతా కారు వేగం, తమకు- కారుకు మధ్య దూరం, రోడ్డు దాటేందుకు కావాల్సిన వేగాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారని వారు తెలిపారు. అదే 14 ఏళ్లు, ఆ పై వయసున్న పిల్లలు మాత్రం ఏమాత్రం తడబడలేదని, కారు వేగాన్ని, కారు దూరాన్ని, లక్ష్యం చేరాల్సిన వేగాన్ని సరిగ్గా అంచనా వేశారని వారు తెలిపారు. దీంతో 14 ఏళ్లు, ఆపైబడ్డవారంతా ప్రమాదాలకు గురికాలేదని వారు వెల్లడించారు. దీంతో 14 ఏళ్ల లోపు పిల్లలు రోడ్డు దాటలేరని, రోడ్డు దాటే సమయంలో వారిని పెద్దలు కనిపెట్టుకుని ఉండాలని సూచించారు. 

  • Loading...

More Telugu News