: బాహుబలి 2 రిలీజ్ కు ముందు 'అనుష్క గొప్పనటి కాదు' అంటూ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు
'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేసిన డబ్బులు శాటిలైట్ హక్కులు, డిస్ట్రిబ్యూషన్, ఆన్ లైన్ ఇలా వివిధ రూపాల్లో ఇప్పటికే వచ్చేసినప్పటికీ...మరిన్ని రికార్డులు సాదించే దిశగా ప్రమోషన్ నిర్వహిస్తూ చిత్రయూనిట్ సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆనుష్క గొప్పనటి కాదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యానించాడు. 'విక్రమార్కుడు', 'బాహుబలి: ద బిగెనింగ్', 'బాహుబలి2: ద కన్ క్లూజన్' సినిమాల్లో హీరోయిన్ వేషమిచ్చిన రాజమౌళి 'అరుంధతి' వంటి సినిమాతో తెలుగు నాట స్టార్ హీరోయిన్ వైభవాన్ని సొంతం చేసుకున్న అనుష్కపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అనుష్క గొప్పనటి కానప్పటికీ, ఆమె ప్రొఫెషనల్ యాక్టర్ అని, చెప్పిన విషయాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకుంటుందని రాజమౌళి చెప్పాడు. ఎవరితో ఎలా మెలగాలో ఆమెకు బాగా తెలుసని అన్నాడు. చాలా మంచి వ్యక్తిత్వమని కితాబునిచ్చాడు. అయితే నటనపరంగా మాత్రం ఆమెకు గొప్ప మార్కులేమీ ఇవ్వనని తెలిపాడు. అలాగే ఆమె నటనపై గొప్ప అంచనాలు కూడా లేవని స్పష్టం చేశాడు. అయితే రమ్యకృష్ణ లాంటి నటికి ఎదురుగా నిలబడి సరైన పోటీ ఇవ్వడం సామాన్య విషయం కాదని, అనుష్క ఆ విషయంలో తనను ఆశ్చర్యానికి గురి చేసిందని రాజమౌళి కితాబునిచ్చాడు.