: ఓయూలో విద్యార్థుల ఆందోళన... భారీ భద్రత మధ్య ఇలా వచ్చి, అలా వెళ్లనున్న రాష్ట్రపతి
ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్న తరుణంలో ముఖ్య అతిథిగా రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన 45 నిమిషాలకు కుదించినట్టు కొద్దిసేపటి క్రితం అధికారులు ప్రకటించారు. ఉస్మానియాలో ఇప్పటికే ఓ వర్గం విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే, రాష్ట్రపతి పర్యటన సమయాన్ని తగ్గించినట్టు తెలుస్తోంది.
మరికాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, అధికారులు స్వాగతం పలకనున్నారు. ఆ తరువాత భారీ భద్రత మధ్య ఉస్మానియాకు చేరుకునే ఆయన, ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించి, వెంటనే అక్కడి నుంచి విడిదికి వచ్చేస్తారు. కాగా, ఉస్మానియా వర్శిటీ ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, విద్యార్థులమన్న గుర్తింపు కార్డులు ఉంటేనే లోనికి అనుమతిస్తున్నారు. గతంలో ఉస్మానియాలో విద్యను అభ్యసించిన ఎంతో మందిని బయటే నిలిపి వేస్తుండటంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.