: ముస్లిం సీనియర్ సిటిజన్ పై దురహంకారం... సీటిచ్చేందుకు నిరాకరించిన యువకులు.. పాకిస్థాన్ కు పొమ్మని సలహా!


తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న ఒక ఘటన మన యువత ఆలోచనా విధానాన్ని వెల్లడిస్తున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఫేస్ బుక్ లో ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త కవితా కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీలోని యెల్లో లైన్ మెట్రోలో ఏఐసీసీఈయూ జాతీయ కార్యదర్శి సంతోష్‌ రాయ్‌ ప్రయాణిస్తుండగా, ఆయన ఎదురుగా సీనియర్ సిటిజన్ సీట్లలో ఇద్దరు యువకులు కూర్చున్నారు. ఇంతలో ఒక ముస్లిం పెద్దాయన ఆ సీట్ వద్దకు వచ్చి.. ఆ సీటు సీనియర్ సిటిజన్స్ దని, దానిని తనకు ఇవ్వాలని కోరారు. దీనికి వారు నిరాకరించారు.

దీంతో ఆ పెద్దాయన ఆ యువకులను ఉద్దేశించి వేరే సీట్లలో కూర్చోవాలని సూచించడంతో ఆగ్రహంగా.. ఆ సీటు హిందుస్థానీలకని, సీటు కావాలంటే పాకిస్థాన్ కు పొమ్మని పెడసరంగా సమాధానం చెప్పారు. ఈ తతంగం మొత్తం చూస్తున్న రాయ్ ఆ పెద్దాయనకు క్షమాపణలు చెప్పాలని సూచించారు. ఆ ఇద్దరికీ మరికొందరు యువకులు అండగా నిలిచి, రాయ్ కాలర్ పట్టుకుని పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో కొందరు మెట్రో ప్రయాణికులు రాయ్ కు మద్దతుగా నిలిచారు.

మెట్రో రైలు ఖాన్ మార్కెట్ స్టేషన్ లో ఆగిన సమయంలో ఒక గార్డు ఆ బోగీలోకి ఎక్కారు. ఆయన రాయ్ తో పాటు ఇద్దరు యువకులు, సీనియర్ సిటిజన్ ను పండారా రోడ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం వారిద్దరిపై కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల తరువాత యువకులపై ఏ చర్యలు తీసుకున్నారంటూ పోలీసులను రాయ్ అడిగేందుకు వెళ్లగా... పెద్దాయన ఆ యువకులను క్షమించారని, అందుకే వదిలేశామని తెలిపారు. ఈ మేరకు యువకులు చెప్పిన క్షమాపణను స్వీకరిస్తున్నట్టుగా రాసిన లేఖను ఆయనకు పోలీసులు చూపించారు.

  • Loading...

More Telugu News