: టెన్త్, ఇంటర్‌లో గ్రేస్ మార్కుల విధానానికి చెక్.. ఈ ఏడాది నుంచే అమలు!
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అమలవుతున్న గ్రేస్ మార్కుల విధానాన్ని ఎత్తివేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లలో అదనపు మార్కుల విధానానికి చెక్ పెట్టాలని భావిస్తున్న సీబీఎస్ఈ ఈ మేరకు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. మోడరేషన్, యాడ్ స్కోర్, గ్రేస్ మార్కుల పేరుతో ఇస్తున్న అదనపు మార్కులను ఎత్తివేయడమే మేలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇటీవల రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీబీఎస్ఈ ఈమేరకు పేర్కొన్నట్టు సమాచారం. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పరీక్షల నియంత్రణ అధికారి సుశీల్ కుమార్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి హాజరయ్యారు. యాడ్ స్కోర్ విధానం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నట్టు సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. ఇంటర్‌మీడియెట్‌తోపాటు ఢిల్లీ, సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో గ్రేస్ మార్కుల విధానానికి చరమగీతం పాడాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది.