: ఒక రోజు సీఈఓ.. ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ను కొట్టేసిన ఆ సంస్థ ఉద్యోగిని పద్మిని!
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన బంపరాఫర్‌ను ఆ సంస్థ ఉద్యోగి పద్మిని పగడాల కొట్టేశారు. సంస్థ పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉద్యోగులకు ఒక్క రోజు సీఈవోగా వ్యవహరించే చాన్స్ కల్పించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఒక రోజు సీఈవోను ఎంపిక చేసేందుకు ‘బిగ్ 10’ పేరిట పోటీ నిర్వహించింది. ఇందులో భాగంగా తాము ఒకరోజు సీఈవోగా ఎందుకు పనిచేయాలనుకుంటున్నదీ రాయాల్సి ఉంటుంది.
అలా రాసి పంపిన వారిలోంచి ఉత్తమంగా రాసిన వారిని ఒకరోజు సీఈవోగా ఎంపిక చేస్తారు. వందలాది మంది ఉద్యోగులు ఈ పోటీలో పాల్గొనగా బెంగళూరులో డిజైన్ విభాగంలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పద్మిని పగడాల విజేతగా నిలిచారు. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తిలానే ఆమె ఒక రోజంతా సీఈవోగా వ్యవహరిస్తారు. సమావేశాలు, బోర్డ్ మీటింగ్‌లకు హాజరుకావడంతోపాటు సీఈవో హోదాలో నిర్ణయాలు తీసుకుంటారు.