: 'మీ మొహాలు అద్దంలో చూసుకోండి' అంటూ డివిలీర్స్ సహచరులకు స్పూర్తి నింపాడు... మ్యాచ్ ను వర్షం ఆపేసింది!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస పరాజయాలతో డీలా పడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్స్ కు కొదవ లేకున్నా ఉత్తమ ఫలితాలు సాధించడంలో మాత్రం వెనుకబడింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి డీలా పడింది. దీంతో జట్టులో స్పూర్తిని నింపే బాధ్యతను స్టార్ ఆటగాడు ఏబీ డివీలియర్స్ భుజానికెత్తుకున్నాడు. ఈ నేపథ్యంలో తన జట్టులోని సహచర ఆటగాళ్లందరికీ ఒక వీడియో సందేశం సోషల్ మీడియాలో విడుదల చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆటగాళ్లంతా తమతమ మొహాలను ఒకసారి అద్దాల్లో చూసుకుని ఐపీఎల్ సీజన్-10 టోర్నీలో బెటర్ ప్రదర్శన ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలని సూచించాడు. టోర్నీలో నిలవాలంటే ఇంకా కేవలం ఏడు మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయని... జట్టుకు ప్రతి గేమ్ చాలా ముఖ్యమని అన్నాడు. జట్టుగా మనం పుంజుకోగలమని తాను పూర్తిగా విశ్వసిస్తున్నానని, మీరు కూడా అలానే నమ్మకం ఉంచాలని ఆకాంక్షించాడు. అయితే డివిలియర్స్ ఇంతలా స్పూర్తి పెంచినా... ఆటమాత్రం సాగలేదు. వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణ అనుమానంగా మారింది. పలు మార్లు గ్రౌండ్స్ మన్, అంపైర్లు వచ్చి పిచ్ చెక్ చేస్తున్నా..ఆగిఆగి కురుస్తున్న వర్షం మాత్రం తెరిపీయడం లేదు.