: ఉస్మానియా వర్సిటీకి వందనం: పవన్ కల్యాణ్ ప్రకటన
ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులను అందిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రణామాలు అని పవన్ పేర్కొన్నారు. బ్రిటిష్ విద్యావేత్త విల్ప్రెడ్ స్యూయిన్ బ్లంట్ ఆలోచనల్లో ఊపిరిపోసుకుని ఏడో నిజాం నవాబు ఉస్మాన్ మీర్ అలీఖాన్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ తల్లి నీడలో చదువుకున్న ఎందరో విద్యార్ధులు, మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, కళాకారులుగా సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. అంతే కాకుండా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తీర్చిదిద్దిన ఈ చదువుల తల్లి శత వసంతాల పండుగను నిర్వహించుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు అని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ ప్రకటన పట్ల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.