: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావును పరామర్శించిన కేసీఆర్
అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావును సీఎం కేసీఆర్ పరామర్శించారు. కేసీఆర్ వెంట ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వినోద్ కుమార్ ఉన్నారు. వైద్యులను అడిగి విద్యాసాగర్ రావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ రోజు ఉదయం వెంటిలేటర్ తొలగిస్తే కొంచెం సేపు స్వతహాగా శ్వాస తీసుకోగలిగారని కేసీఆర్ కు వైద్యులు తెలిపారు. అనంతరం, విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాగా, విద్యాసాగర్ రావుకు చికిత్స అందుతున్న తీరుపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకునేలా చూడాలని ఈ సందర్భంగా వైద్యులకు కేసీఆర్ సూచించారు.