: సినీ దర్శకులపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్లను తెరపై చూపిస్తున్న తీరుపై ప్రముఖ నటి జ్యోతిక అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దర్శకులపై సంచలన వ్యాఖ్యలతో పాటు సూచనలు కూడా చేసింది. జ్యోతిక, ఊర్వశి, భానుప్రియ, నాజర్, శరణ్య పొన్నవన్ తదితరులు నటించిన ‘మగళిర్ మట్టుమ్’ చిత్రం ఆడియో వేడుక కార్యక్రమం చెన్నైలో నిన్న నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన జ్యోతిక పై వ్యాఖ్యలు చేసింది.
పెద్ద హీరోలతో సినిమాలు తీసే దర్శకులందరూ తమ కథల్లో హీరోయిన్లను గౌరవ ప్రదంగా చూపించాలని విజ్ఞప్తి చేసింది. ఆయా రచయితలు, దర్శకులు నిజ జీవితంలో తమ తల్లి లేదా భార్య లేదా ప్రియురాలిని గుర్తు చేసుకుని పాత్రలు రాయాలని సూచించింది. హీరోయిన్లకు మంచి కాస్ట్యూమ్స్ ఇవ్వరని విమర్శించింది. హీరోయిన్లతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించడం, సిగ్గులేకుండా హీరోల వెనుక పడటం వంటి సన్నివేశాలు చూడడానికి బాగుండవని చెప్పింది.
హీరోలకు భారీగా అభిమానులు ఉంటారని, వారు చెప్పే డైలాగులు, సన్నివేశాల ప్రభావం యువతపై, ముఖ్యంగా అభిమానులపై చాలా ప్రభావం చూపుతాయని జ్యోతిక అభిప్రాయపడింది. అంతేకాకుండా, ఒక హీరోకి నలుగురు హీరోయిన్లు ఉండేలా సినిమాలు తీస్తుంటే .. అదే స్ఫూర్తితో వారి అభిమానులు కూడా ముగ్గురు లేదా నలుగురు గర్ల్స్ ఫ్రెండ్స్ కావాలనుకోరా? అని జ్యోతిక ప్రశ్నించింది. ఒక హీరోకి ఒక హీరోయిన్ చాలని, రెండో హీరోయిన్ అవసరం లేదని, ఈ విషయమై దర్శకులకు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొంది.