: లోకేశ్ లోపాలను ఎత్తిచూపితే సోషల్ మీడియా కార్యాలయంపై దాడులు చేయడం ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి
తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ లోపాలను ఎత్తిచూపితే టీడీపీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తమను నేరుగా ఎదుర్కోలేకే టీడీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. ఇటువంటి దాడులు నిర్వహించి, అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఈ విషయంపై తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అసెంబ్లీ కార్యదర్శిని, పోలీసులను ప్రశ్నిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్రమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలకు దిగుతున్నారని, చంద్రబాబు వద్ద మెప్పు పొందేందుకే ఆయన విమర్శలు చేస్తున్నారని కాకాని అన్నారు. రాష్ట్రంలో చంద్రమోహన్‌రెడ్డి అంటే ఎవరూ గుర్తుపట్టడంలేదని, చందాలరెడ్డి అంటే మాత్రం వెంటనే గుర్తు పడుతున్నారని, ఆ విధంగా ఆయన అవినీతికి పాల్పడుతున్నారని కాకాని ఆరోపించారు.