: వైకాపాకు సాయం చేసేందుకు కదిలిన ప్రశాంత్ కిషోర్... జగన్ తో డీల్!
2019లో లేదా అంతకన్నా ముందుగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగితే అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైకాపా అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, మోదీని ప్రధానిగా నిలిపి, ఆపై బీహార్ లో మహాకూటమి విజయానికి కారకుల్లో ఒకరని భావించే ప్రశాంత కిషోర్ ను నియమించుకున్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను పునరావృతం కానివ్వరాదన్న ఆలోచనలో ఉన్న జగన్, తన పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లేందుకు ప్రశాంత్ సహకారాన్ని తీసుకోనున్నారు. జగన్ తో డీల్ కుదుర్చుకున్న ఆయన, త్వరలోనే ఏపీకి వచ్చి మకాం వేయడంతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, ప్రజా నాడిని అంచనా వేసే పనులు ప్రారంభించనున్నారు. ఆపై తన టీమ్ సాయంతో వైకాపాకు గెలుపు దిశగా సాగేందుకు సలహాలు, సూచనలు అందించనున్నారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల సంకేతాలు రావడంతో సాధ్యమైనంత త్వరగా ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతారని సమాచారం.