: మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞకు బెయిల్.. కల్నల్ శ్రీకాంత్ కు నిరాకరణ
2008 నాటి మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞ సింగ్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో మరో నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ కు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గత ఎనిమిదేళ్లుగా వీరిద్దరూ జైల్లోనే ఉన్నారు. గత సంవత్సరం బెయిల్ కోసం వీరిద్దరూ అప్పీల్ చేసినా, దిగువ కోర్టు కొట్టివేసింది. దీంతో, వీరిద్దరూ బాంబే హైకోర్టులో అప్పీల్ చేశారు.
కేసు వివరాల్లోకి వెళ్తే, 2008 సెప్టెంబర్ 29వ తేదీన ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెగావ్ లో మోటార్ సైకిల్ కు అమర్చిన రెండు బాంబులు పేలి ఏడుగురు దుర్మరణం చెందారు. వంద మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అదే ఏడాది వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబు పేలుళ్లకు వీరిద్దరే కారణమని ఆరోపించారు. అయితే, దీనికి సంబంధించి సరైన సాక్ష్యాలు లేకపోవడంతో... సాధ్వితో సహా మరో ఐదుగురిపై ఉన్న ఆరోపణలను ఎన్ఐఏ ఉపసంహరించుకుంది. అయితే, ముంబై ప్రత్యేక కోర్టు మాత్రం ఎన్ఐఏ చర్యను తప్పుబడుతూ, వీరికి బెయిల్ ను నిరాకరించింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు బాంబే హైకోర్టు సాధ్వికి బెయిల్ మంజూరు చేసింది. ఇటీవలే వైద్య చికిత్స కోసం ఆమెను భోపాల్ ఆసుపత్రికి తరలించారు.