: బాహుబలి పేరిట సైబర్ మోసం... 'న్యూ టికెట్స్'లో కొన్న టికెట్లన్నీ వేస్ట్... తీవ్ర గందరగోళం!


బాహుబలి-2పై ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగిన సైబర్ నేరగాళ్లు కోట్లాది రూపాయల విలువైన మోసానికి తెగబడ్డారు. కోయంబత్తూర్ కేంద్రంగా ఓ వెబ్ సైట్ ను రిజిస్టర్ చేసుకుని, దుబాయ్ ఐపీ అడ్రస్, 'పేయూ మనీ'తో డీల్ కుదుర్చుకుని 'www.newtickets.in' పేరిట వెబ్ సైట్ తెరిచి టికెట్లు విక్రయించి మోసం చేశారు. ఇప్పటికే బుక్ మై షో, ఈజీమూవీస్, టికెట్ అడ్డా వంటి వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచిన ఏ షోకూ టికెట్లు లేవని కనిపిస్తుండగా, న్యూ టికెట్స్ వెబ్ సైట్లో మాత్రం అన్ని సీట్లూ ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దీంతో సినీ అభిమానులు ఎంతో మంది డబ్బు చెల్లించి టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ వెబ్ సైట్ నుంచి టికెట్లు కొన్న వారి ఫోన్లకు కన్ఫర్మ్ సందేశాలు కూడా వస్తున్నాయి. ఇక వీరంతా సినిమా హాళ్లకు వెళితే, తీవ్ర గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది.

హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో బాహుబలికి సంబంధించిన టికెట్ల విక్రయాన్ని ఆన్ లైన్లో ఇంకా ప్రారంభించనే లేదు. న్యూ టికెట్స్ మాత్రం టికెట్లను విక్రయించింది. తాము సదరు వెబ్ సైట్ తో ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని ప్రసాద్స్ యాజమాన్యం తెలిపింది. అధీకృత వెబ్ సైట్ల నుంచి బుక్ చేసుకున్న టికెట్లను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ వెబ్ సైట్ ద్వారా టికెట్లు కొన్న వారిలో తీవ్ర ఆందోళన నెలకొని వుండగా, టికెట్లు కొనుగోలు చేసే సమయంలో వెబ్ సైట్ల విశ్వసనీయతను పరిశీలించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ ను బ్లాక్ చేసినప్పటికీ, టికెట్లు కొన్న వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.

  • Loading...

More Telugu News