: తమిళనాడులో అప్రకటిత కర్ఫ్యూ... స్టాలిన్ అరెస్ట్
రైతు సమస్యల పరిష్కారం, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, తమిళనాడులో విపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కు మంచి స్పందన లభించింది. అన్ని వ్యాపార సంస్థలు, ప్రైవేటు కంపెనీలు సహా, మాల్స్, సినిమా హాల్స్ స్వచ్ఛందంగా మూతబడ్డాయి. చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, మధురై, తిరుచురాపల్లి, దిండిగల్ తదితర ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.
చెన్నై మౌంటు రోడ్డులో వామపక్షాల నేతలు నిరసనకు దిగి, సాధారణ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తిరువారూరులో డీఎంకే చేపట్టిన నిరసనలో ఆ పార్టీ శాసనసభా పక్ష నేత స్టాలిన్ పాల్గొనగా, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, లారీలు, బస్సులు నిలిచిపోయాయి. బందోబస్తు విధుల్లో సుమారు లక్ష మంది పోలీసులు పాల్గొంటున్నారు. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి చెన్నైకి బస్సులు కదల్లేదు. నెల్లూరు నుంచి సూళ్లూరు పేట వరకూ మాత్రమే బస్సులు నడుస్తున్నాయి.