: ఇప్పుడేం చేద్దాం ?... తర్జన భర్జనలో పళనిస్వామి వర్గం... నేడు రహస్య భేటీ!
అన్నాడీఎంకే పార్టీ పేరు, ప్రజల్లో పాతుకుపోయిన రెండాకుల గుర్తు లభించాలంటే పన్నీర్ సెల్వం వర్గం నుంచి మద్దతు, వారిని తిరిగి కలుపుకోవడం మినహా మరో మార్గం లేదని భావిస్తున్న పళనిస్వామి వర్గం ఈ విషయంలో ఏం చేయాలన్న విషయమై మల్లగుల్లాలు పడుతోంది. సీఎం పదవి తనకివ్వాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తుండటాన్ని అంగీకరించేందుకు ఇష్టపడని ఆయన, విలీనం దిశగా చర్చలను మాత్రం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో నేడు ఇరు వర్గాల మధ్యా రహస్య భేటీ జరగనుందని తెలుస్తోంది. పార్టీ చీఫ్ పదవి అంశంలోనూ రెండు వర్గాల మధ్యా ఏకాభిప్రాయం ఇప్పటికింకా కుదరలేదని సమాచారం. ఓ దశలో పన్నీర్ సెల్వంకు సీఎం పదవి, పళనిస్వామికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ, పళని వర్గం ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో చర్చలను కొనసాగించాలని మాత్రం ఇరు వర్గాలూ నిర్ణయించాయి. శశికళ కుటుంబాన్ని దూరం పెట్టే అంశంపై మాత్రం పన్నీర్ వర్గం డిమాండ్ ను పళనిస్వామి ఓకే చేశారు. జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించలేమని తేల్చి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక నేడు, రేపు కూడా పన్నీర్, పళని వర్గాల మధ్య చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. దీంతో అన్నాడీఎంకే గ్రూపుల విలీనం రాజకీయాలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి.