: 25 ఏళ్లుగా ఇవే విమర్శలు వింటున్నా.. ఎవరు అవార్డు గెలిచినా ఇంతే!: అక్షయ్‌కుమార్ ఆగ్రహం
ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఈ అంశంపై పలువురు చేస్తోన్న విమర్శల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ నటుడికి అవార్డు వచ్చినా ఇటువంటి విమర్శలే చేస్తారని, తాను 25 ఏళ్లుగా ఇవే విమర్శలు వింటున్నానని ఆయన అన్నాడు. ఎవరో ఒకరు వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డాడు. తాను 26 ఏళ్ల తర్వాత తొలిసారి నేషనల్ అవార్డు గెలిచానని వ్యాఖ్యానించిన ఆయన... అది కూడా మీకు కావాలంటే మీరే తీసేసుకోండి అని అన్నాడు.
రుస్తుం సినిమాకుగాను అక్షయ్‌కు ఈ అవార్డు వచ్చింది. అయితే, హేరాఫేరీ, భాగమ్ భాగ్‌లాంటి చిత్రాల్లో అక్షయ్‌ను డైరెక్ట్ చేసిన ప్రియదర్శన్ నేషనల్ అవార్డు జ్యూరీ చైర్మన్‌గా ఉండటం వల్లే అక్షయ్‌కు అవార్డు ఇచ్చారని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దంగల్ వంటి సినిమాలో అద్భుతంగా నటించిన ఆమిర్‌ఖాన్, అలీగడ్ సినిమాలో అదరహో అనిపించిన మనోజ్ బాజ్‌పేయి వంటి వారికి కాకుండా అక్షయ్‌కు అవార్డు ఇవ్వడమేంటని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపైనే అక్షయ్ ఇలా స్పందించాడు.