: దినకరన్ తో నిజం కక్కించిన ఆ వీడియోలో ఏముంది?
సుఖేష్ చంద్రశేఖర్ అంటే ఎవరో తెలియదని చెప్పిన శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ పోలీసులు చూపిన వీడియో సాక్ష్యంతో నిజం ఒప్పుకున్నాడు. ఇంతకీ దినకరన్ తో నిజం కక్కించిన ఆ వీడియోలో ఏముంది?
వాస్తవానికి సుకేష్ ను విచారించిన తరువాత ఈ కేసులో దినకరన్ చేసిన లంచం కుట్ర విషయం బయటకు వచ్చింది. ఆపై వారిద్దరికీ ఉన్న సంబంధాలపై జనార్దనన్, మల్లికార్జున అనే వ్యక్తుల నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. ఇక దినకరన్ ను విచారిస్తున్న వేళ, తొలుత వీరిద్దరి పేర్లనే పోలీసులు ప్రస్తావించారు. ఆపై తాను సుకేష్ తో మాట్లాడిన మాట వాస్తవమేనని, అయితే, అ వ్యక్తే సుకేష్ అని తెలియదని, న్యాయమూర్తితో మాట్లాడానని అనుకున్నానని బుకాయించబోయాడు.
దీంతో పోలీసులు వారి వద్ద ఉన్న వీడియో అస్త్రాన్ని బయటకు తీశారు. దినకరన్, సుకేష్ ల మధ్య జరిగిన సంభాషణ వీడియోను చూపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేని పరిస్థితిని సృష్టించారు. దీంతో సుకేష్ తో తన పరిచయాన్ని దినకరన్ అంగీకరించి, చేసిన తప్పంతా చెప్పుకొచ్చాడు. ఈ కేసులో నేడు వరుసగా నాలుగో రోజు దినకరన్ ను పోలీసులు విచారణకు పిలిచారు.