: యోగికి సుప్రీం గ్రీన్ సిగ్నల్.. యూపీలో లక్షకుపైగా పోలీసు పోస్టుల భర్తీకి ఆమోదం
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు లక్షకుపైగా పోలీసు పోస్టులను భర్తీ చేయాలన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రణాళికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో పెచ్చుమీరిన శాంతిభద్రతలను కాపాడేందుకు ఏడాదికి 33 వేలమంది చొప్పున 2021 నాటికి రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఉన్న మొత్తం పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారు. యోగి ప్రణాళికకు ఆమోదముద్ర వేసిన సుప్రీం ధర్మాసనం నియామకాలు ఆలస్యం కాకుండా చూసుకోవాలని సూచించింది. ఆలస్యమైతే రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి, లేదంటే అత్యంత సీనియర్ అధికారిని తప్పుపట్టాల్సి వస్తుందని పేర్కొంది. దేశంలోని పోలీసు విభాగంలో ఖాళీలను భర్తీ చేయాలంటూ 2013లో దాఖలైన పిల్‌ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.