: ముంబై విజయాలకు బ్రేకేసిన పుణె.. మూడు పరుగుల తేడాతో విజయం
ఐపీఎల్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌కు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ షాకిచ్చింది. సోమవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో గెలిచి ముంబై విజయ పరంపరకు బ్రేకేసింది. ఆరు విజయాల తర్వాత ముంబైకి ఇది తొలి ఓటమి కావడం గమనార్హం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పుణె నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ విజయం ముందు బోల్తా పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
ముంబై ఓపెనర్లు పార్థివ్ పటేల్, బట్లర్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేశారు. అయితే ఐదో ఓవర్లో బట్లర్ (17) ఔటవడంతో తర్వాత ఇక నిలదొక్కుకోలేకపోయింది. ఫామ్‌లో ఉన్న రాణా(3) సైతం సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడంతో ముంబైకి కష్టాలు తప్పలేదు. ఆ తర్వాత పార్థివ్ పటేల్ (33), కర్ణ్‌శర్మ (11) కూడా పెవిలియన్ చేరడంతో విజయం ఆశలు సన్నగిల్లాయి. అయితే పొలార్డ్ ఉన్నాడన్న ధీమాతో ఉన్న జట్టుకు పుణె బౌలిర్ తాహిర్ షాకిచ్చాడు. పొలార్డ్‌ను పెవిలియన్ పంపడంతో మ్యాచ్ పుణె చేతుల్లోకి వచ్చింది. చివరి ఓవర్లలో విజయానికి 17 పరుగులు అవసరమున్న దశలో ఒత్తిడి పెరగడంతో హార్ధిక్(13) అవుటయ్యాడు. దీంతో ముంబై మూడు పరుగులతో ఓటమి చవిచూసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పుణె రహానె(38), రాహుల్ త్రిపాఠీ(45) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.